
గుంటూరు:డిసెంబరు 22 :-విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరమని, అది చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) ముగింపు కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు.

సైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రంపై ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉన్నత చదువులు, పోటీ పరీక్షల్లో విజయం, శాస్త్రవేత్తగా ఎదగాలంటే శాస్త్రీయ ఆలోచన తప్పనిసరిగా ఉండాలన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగినవారు జీవితంలో ముందుకు సాగుతారని చెప్పారు.
విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పిల్లల విజయం తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుందని, ఇదే ఉత్సాహంతో వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని సూచించారు
విద్యారంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఫౌండేషన్ స్థాయిలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం అంశాలపై సర్వే జరుగుతోందని, విద్యార్థుల సమగ్ర అభ్యసనాన్ని నమోదు చేస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. సమ్మెటివ్, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులు
జిల్లాలో ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని, పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. 185 ఉన్నత పాఠశాలల్లో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని అమలు చేస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ఉన్నత అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.Guntur Local News
జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలను వ్యక్తిగతంగా, బృందాల వారీగా నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







