
బాపట్ల రూరల్: నవంబర్ 12:-వికలాంగులైన మాజీ సైనికుల పిల్లలకు రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు.బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చీరాల నాగేంద్రరెడ్డి కుమారుడు శశికిరణ్ రెడ్డి 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమై ఉన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావుకు తెలిసిన వెంటనే, ఆయన గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి గుణశీలాకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన శ్రీమతి గుణశీలా ఈరోజు తన సిబ్బందితో కలిసి పాత నందాయపాలెం గ్రామానికి వెళ్లి పత్రాలను పరిశీలించారు. అనంతరం శశికిరణ్ రెడ్డికి ప్రతి నెల రూ.2,500/- ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు సైనిక్ వెల్ఫేర్ అధికారిణి గుణశీలాకు ధన్యవాదాలు తెలియజేశారు. 50 శాతం పైబడి అంగవైకల్యం ఉన్న మాజీ సైనికుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అర్హులైన మాజీ సైనికులు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన సూచించారు.సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలా మాట్లాడుతూ, “అంగవైకల్యం కలిగిన మాజీ సైనికుల పిల్లల వివరాలు అందిన వెంటనే పరిశీలించి, అర్హులైన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.కార్యక్రమంలో గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆనందరావు, సుబ్రహ్మణ్యం, రాజేష్‌తో పాటు APRMSSS రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు డి. వెంకటేశ్వర్లు, ఎం.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







