
మంగళగిరి, నవంబర్ 4:-సమాచార హక్కు చట్టం (RTI Act) యొక్క అసలు ఉద్దేశ్యం, విలువలను కాపాడుతూ ప్రజల ప్రయోజనానికి ఉపయోగించాలన్నారు రాష్ట్ర సమాచార కమిషనర్ రెహానా బేగం. మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ఆమెను ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షుడు ప్రత్తిపాటి చంద్రమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ కమిషనర్ రెహానా బేగం తెలిపారు – రాష్ట్రంలో కొంతమంది అవసరం లేని అంశాలపై ఆర్టీఐలు వేస్తుండటం, మరికొందరు బ్లాక్‌మెయిల్ చేయడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
“సమాచార హక్కు చట్టం అనేది భావితరాలకు మంచి ఆస్తి. ఈ చట్టం ద్వారా ప్రజలు అవినీతిని అరికట్టాలి. దాన్ని దుర్వినియోగం చేస్తే అసలు ఉద్దేశ్యం నశిస్తుంది,” అని ఆమె హెచ్చరించారు.అలాగే, ఈ చట్టం ఏర్పాటుకు ఎందరో త్యాగాలు చేసిన విషయం గుర్తుచేస్తూ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో ఆర్టీఐపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ ఉపాధ్యక్షుడు మట్ట ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.







