
మచిలీపట్నం, అక్టోబర్ 21:-ప్రపంచం నిద్రలో మునిగితే, మేల్కొని కాపలా కాసేది ఒక్క వర్గం — పోలీసులు. ప్రజల భద్రత కోసం ఎండవానలు లెక్కచేయకుండా, కుటుంబ సుఖాలను పక్కనబెట్టి సేవలందించే ఈ వృత్తి నిజంగా త్యాగమయమైనది. పండుగల వేళ ప్రజలు ఆనందంలో మునిగితే, వీరు విధి నిర్వర్తనలో మునిగిపోయి ఉంటారు.అటువంటి త్యాగవ్రతుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలనైనా లెక్క చేయకుండా ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసుల త్యాగం మరువలేనిది. ఆ సమయంలో ప్రజలు ఇళ్లలో ఉండగా, వీరు రోడ్లపై నిలబడి సమాజాన్ని రక్షించారు. అనేకమంది పోలీసులు ఆ మహమ్మారికి బలై, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించారు.పోలీసు ఉద్యోగం ఒక సాధారణ ఉద్యోగం కాదు — ఇది 24 గంటల సేవ. శాంతిభద్రతలు కాపాడడం, నేరగాళ్లను అదుపులో పెట్టడం, సామాజిక ఆస్తులను సంరక్షించడం, ప్రజల ప్రాణాలు కాపాడడం వీరి కర్తవ్యాలు. దేశ సరిహద్దులను రక్షించేది సైన్యం అయితే, దేశ అంతర్గత భద్రతకు భరోసా ఇవ్వేది పోలీసులు.ఒత్తిడులు, విమర్శలు, కఠిన పరిస్థితులు ఎదురైనా పోలీసులు తమ విధిని అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. సమాజానికి భరోసా, భద్రతను అందిస్తున్న ఈ స్ఫూర్తిదాయకుల సేవలను గౌరవించడం మన అందరి బాధ్యత.పోలీసు అంటే భద్రతకు ప్రతీక, సమాజానికి సంరక్షకుడు.







