
చీరాల, మార్చి 23 (ప్రజా ప్రతినిధి): రంజాన్ పండుగ ముగియడం, దానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో బాపట్ల జిల్లా చీరాల తీర ప్రాంతాలకు ముస్లిం సోదరులు మరియు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీరానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా రక్షణ నియమాలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సముద్ర స్నానాలకు వచ్చే వారు లోతట్టు ప్రాంతాలకు వెళ్లరాదని, ముఖ్యంగా మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. పర్యాటకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సురక్షితంగా ఆస్వాదించి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలు మరియు భద్రత: తీరానికి వచ్చే వాహనదారులు అతి వేగంతో ప్రయాణించకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో వచ్చేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, వాహనం నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడటం వంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, కావున నిబంధనలు అతిక్రమించవద్దని పేర్కొన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పిల్లల పట్ల అప్రమత్తత: దూర ప్రాంతాల నుండి వచ్చే వారు తమ వ్యక్తిగత వస్తువులతో పాటు, చిన్న పిల్లల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వారిని ఒంటరిగా వదలరాదని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసు సహాయక నంబర్లను సంప్రదించాలని కోరారు.
ప్రస్తుతం తీర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు సీఐ శేషగిరి ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్ధన్ మరియు పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.http://BAPATLA NEWS







