స్త్రీల ఆరోగ్యంలో గర్భాశయం కీలకమైన భాగం. సంతానోత్పత్తి, హార్మోన్ల సమతుల్యత, మానసిక ఆరోగ్యం, ఋతు చక్రం సరిగ్గా ఉండడానికి గర్భాశయం బలంగా ఉండడం తప్పనిసరి. అయితే జీవితశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా పీరియడ్స్ సమస్యలు, గర్భం దాల్చకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు స్త్రీలను వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మందులకంటే ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలది యోగా. యోగా శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, మానసిక ప్రశాంతత ఇస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, గర్భాశయాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా స్త్రీలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, పొత్తికడుపు వాపు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను అధిగమించడమే కాకుండా గర్భాశయ బలాన్ని పెంచుకోవచ్చు.
సీతాకోకచిలుక భంగిమ (బద్ధకోనాసనం) గర్భాశయాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం తుంటి, గజ్జల కండరాలను సాగదీయడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజు రోజుకు వస్తున్న ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఈ ఆసనం తోడ్పడుతుంది. పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
భుజంగాసనం (కోబ్రా పోజ్) చేయడం ద్వారా వెన్నెముకకు వశ్యత రావడంతో పాటు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గర్భాశయం వైపు రక్తప్రసరణను పెంచి, కండరాల ఒత్తిడిని తగ్గించడంతో పాటు కటి ప్రాంతంలోని నరాలకు సాగతీత ఇస్తుంది. గర్భాశయం బలహీనత కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
బ్రిడ్జ్ పోజ్ (సేతుబంధాసనం) వల్ల వెన్నెముక, నడుము, కటిబంధం బలపడతాయి. ఇది గర్భాశయానికి మంచి రక్తప్రసరణను అందిస్తుంది. హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో కూడా ఈ ఆసనం పాత్ర పోషిస్తుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి గర్భాశయం బలంగా ఉండాలి, దానికి ఈ యోగా ఆసనం ఉపకరిస్తుంది.
మలసాన (గుర్రం భంగిమ) చేయడం వల్ల కటిబంధ ప్రాంతంలో బలాన్ని అందిస్తూనే జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, పొత్తికడుపు వాపు లాంటి సమస్యలను నివారిస్తుంది. మలసాన కూర్చున్నప్పుడు రక్తప్రసరణ క్రమంగా పెరిగి గర్భాశయానికి లభిస్తుంది. రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆసనం వేయడం శ్రేయస్కరం.
యోగా చేయడం ద్వారా శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కాపాడబడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల గర్భాశయం బలపడుతుంది. దీని వల్ల ఋతు చక్రం సమయానికి వస్తుంది. ఈ యాసనాలు చేయడం ద్వారా మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది.
స్త్రీలు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సుమారు 20-30 నిమిషాలు ఈ యోగా ఆసనాలను వేయడం వల్ల శరీరాన్ని బలోపేతం చేసుకోవచ్చు. యోగా అనేది ఒక జీవనశైలి మార్పు కాబట్టి దీన్ని శ్రమగా కాకుండా ఆనందంగా చేయడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా లభిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, గర్భాశయాన్ని బలంగా ఉంచుకుని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ యోగా ఆసనాలు ఎంతగానో తోడ్పడతాయి. డాక్టర్ సలహాతో పాటు యోగా ద్వారా స్త్రీలు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.