
గుంటూరు, జనవరి 19:- గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా ఘన విజయం పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సరస్ మేళా విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సరస్ మేళా ద్వారా గుంటూరు జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయగా, రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగాయని తెలిపారు. దాదాపు 14 లక్షల మంది సందర్శకులు మేళాను సందర్శించడం విశేషమన్నారు.
కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ కృషి ఫలితంగానే గుంటూరులో సరస్ మేళా నిర్వహణ సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న సరస్ మేళాను ప్రారంభించారని గుర్తుచేశారు.
ప్రజా ప్రతినిధులు, జాతీయ పేదరిక నిర్మూలన విభాగం అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మేళాను విజయవంతం చేశారని కలెక్టర్ ప్రశంసించారు. గుంటూరు ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని, మీడియా అందించిన సహకారం అభినందనీయమన్నారు.guntur 3
సరస్ మేళా మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిందని, స్వయం సహాయక సంఘాల మహిళలు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్‌ను ఆకట్టుకున్నారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా డ్వాక్రా మహిళలు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సరస్ వేదికగా మారిందన్నారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు మహిళలను భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు.
ఇతర రాష్ట్రాల ఆహార అభిరుచులు, సంస్కృతులను ప్రజలకు పరిచయం చేయడంలో సరస్ మేళా గొప్ప విజయాన్ని సాధించిందని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.










