
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. ఆ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను సందర్శించి, సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
ప్రముఖులతో భేటీ:
ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మరియు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ప్రముఖులు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల ప్రాధాన్యతను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను వారికి వివరించారు.
రాజకీయ చైతన్యం అవసరం: ఎమ్మెల్యే ఏలూరి
అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. “శాసనసభ వంటి అత్యున్నత వేదికలను ప్రత్యక్షంగా చూడటం వల్ల చట్టాల తయారీ, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయనే అంశంపై విద్యార్థులకు పూర్తి అవగాహన కలుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు:
తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చొరవతో అసెంబ్లీని సందర్శించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్, మంత్రులతో నేరుగా మాట్లాడటం తమకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు.bapatla news







