
Palnadu:సత్తెనపల్లి, అక్టోబర్ 15:స్వామి వివేకానంద చైతన్య భారతి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు, యువత, వివిధ సంఘాల సభ్యులు పాల్గొని కలాం సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమంలో ప్రసంగించిన ప్రతాపసింహ శాస్త్రి మాట్లాడుతూ, “క్షిపణుల రూపకల్పనతో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన మహాత్ముడు కలాం. ఆయన జీవితం, త్యాగం, విజ్ఞానపరమైన దార్శనికత యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
“కలాం గారిని ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు కలిగింది” అని సంస్థ ఉపాధ్యక్షుడు పుట్టి సాంబశివరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. “మారుమూల గ్రామంలో జన్మించి రాష్ట్రపతి పదవిని అధిరోహించిన కలాం జీవితంలో ఉన్నత విలువలను ఆచరిస్తూ, యువతకు స్ఫూర్తినిచ్చారు” అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సంస్థ సభ్యులు వేదాద్రి, అన్నం కృష్ణ, రవికుమార్ కలాం విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. సభ్యుడు అబ్బూరి సత్యనారాయణ మాట్లాడుతూ, “యువత పెద్ద కలలు కని, అవి నెరవేర్చేందుకు నిరంతరం శ్రమించాలి” అని పిలుపునిచ్చారు.సంస్థ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ, “మహనీయుల జీవితాలను యువతకు పరిచయం చేయాలనే లక్ష్యంతో స్వామి వివేకానంద చైతన్య భారతి సంస్థను డాక్టర్ జి. శ్రీసర్ అధ్యక్షతన సత్తెనపల్లిలో స్థాపించాం” అని వెల్లడించారు.కార్యక్రమంలో రెడ్ క్రాస్ పట్టణ అధ్యక్షుడు ఆళ్ల శేఖర్, ఆర్ఎస్ఎస్ సభ్యులు రాంబాబు, ఆనంద్, కృష్ణమోహన్, హరేరామ్, అలాగే agkm వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాపుగంటి రత్తయ్య, సభ్యులు వెంకటేశ్వరరావు, వీరారెడ్డి, వెంగళరెడ్డి, సుధాకర్, జాకిర్, హైదర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.







