గుంటూరు, అక్టోబరు 5:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమం కింద సోమవారం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన జిఎస్టి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
సెలూన్లు, స్పా కేంద్రాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు.
విద్యాసంస్థల్లో పోటీలు – 7, 8 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు:
ఈ నెల 7, 8 తేదీలలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ పోటీలకు గాను “జీఎస్టీ పరిణామం”, “ఒకే దేశం – ఒకే పన్ను”, “జీఎస్టీ 2.0 సంస్కరణలు”, “పన్ను ఉపశమనం”, “MSME అభివృద్ధిలో జీఎస్టీ పాత్ర” వంటి ఇతివృత్తాలను ఎంపిక చేయాలని సూచించారు.
జీఎస్టీ వల్ల వచ్చిన మార్పులు, సామాన్యుడిపై ప్రభావం, మౌలిక వసతుల అభివృద్ధిలో పాత్ర, డిజిటల్ పన్ను వ్యవస్థ ప్రాముఖ్యత, స్టార్టప్‌లకు లభించే ప్రయోజనాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతమాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.