
బాపట్ల: 3.12.2025:-జె.పంగులూరు మండలం చందలూరు గ్రామ రామాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీ కోసం వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ పాల్గొని రైతులకు సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందుకునే మార్గం సేంద్రీయ వ్యవసాయం అనే విషయం రైతులు గుర్తించాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా రైతు సాధికారిక సంస్థ, ప్రజా బాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటుచేసిన తొమ్మిది రకాల సేంద్రియ వ్యవసాయ విధానాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.తదుపరి జరిగిన సభలో మాట్లాడుతూ, నవంబర్ 24 నుంచి 29 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్న మీ కోసం వారోత్సవాలు నిర్వహించినట్లు, ప్రస్తుతం వర్క్‌షాప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో, భూసారం పరీక్షించి భూసార ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఎరువుల వినియోగం తగ్గించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. భూసారం ప్రకారం ఎరువుల వినియోగం చేస్తే ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు.

అధికంగా క్రిమిసంహారక మందులు వాడటం వల్ల పంట నాణ్యత తగ్గడం మాత్రమే కాక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేసి మంచి లాభాలు అందుకున్న చందలూరు రైతు నరేంద్ర, అడవి పాలెం రైతు డి.వి.సుబ్బారావు తమ అనుభవాలను పంచుకున్నారు. బీజామృతం, జీవవైవిద్యం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఎలాంటి రసాయన మందులు ఉపయోగించకుండా చేసిన వ్యవసాయం గురించి రైతులకు వివరించారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బాపట్ల అగ్రికల్చర్ కళాశాల శాస్త్రవేత్తలు సేకరించగా, వాటిని కలెక్టర్ పరిష్కరించారు. అవగాహన లేకుండా అధిక ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం తగ్గుతోందని, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ఆయన సూచించారు. తెగుళ్లు, వ్యాధులపై సలహాల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు (970489648), డాక్టర్ బిందుమాధవి (8985622133)లను సంప్రదించాలని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రూపొందించారని కలెక్టర్ వివరించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి ఐదు విధానాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం స్వయంగా పొలాల్లో రైతులతో కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు సూచిస్తున్న తీరు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
బాపట్ల జిల్లాలో వరి సాగు ప్రాధాన్యం ఉన్నందున నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల కథలను సేకరించి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఛానల్ Collector Bapatla మరియు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు పథకాల గురించి చేరవేస్తున్నామని, రైతులు ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఫాలో కావాలని కలెక్టర్ కోరారు.గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు, మండల ప్రత్యేక అధికారి అనంతరాజు, ఎంఆర్వో సింగారావు, ఏవో సుబ్బారెడ్డి, ఎంపీడీవో స్వరూపారాణి, ఉద్యానవన శాఖ అధికారి దీప్తి తదితరులు పాల్గొన్నారు.








