
బాపట్ల, ఫిబ్రవరి 02, 2026:– అంగన్వాడి కేంద్రాలకు “తల్లి ప్రేమ”ను చేరువ చేయాలనే లక్ష్యంతో బాపట్ల సేవా సేతు ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. తెలిపారు.
సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 1,552 అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రతి అంగన్వాడి కేంద్రానికి అవసరమైన పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాతలు అందించే విరాళాలను సద్వినియోగం చేసుకునేందుకు బాపట్ల సేవా సేతు ద్వారా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అంగన్వాడి కేంద్రాల్లో ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు తల్లి ప్రేమతో కూడిన సంరక్షణ అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులను వెబ్‌సైట్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు.bapatla news
విరాళాల రూపంలో అందిన వస్తువులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడి సూపర్వైజర్లు, సిడిపివోలకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చి, పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.

పేదలకు బహుళ ప్రయోజనం కలిగించేలా రూపొందించిన బాపట్ల సేవా సేతు వెబ్‌సైట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పి4 కార్యక్రమ స్ఫూర్తితోనే బాపట్ల సేవా సేతును ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, ఐసిడిఎస్ సిడిపివోలు, అంగన్వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.










