

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు చీరాల డిఎస్పి మోయిన్ సూచనల మేరకు శక్తి టీం ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో వేటపాలెం మండలంలోని నాయనిపల్లి వెస్ట్, ఈస్ట్ మరియు ఓఆర్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లలో పిల్లలు, బాలికలు, యువత భద్రతను పెంపొందించేందుకు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై “డ్రగ్స్ వద్దు బ్రో” ప్రచారం, అలాగే పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర సహాయం పొందే విధానం, మహిళలు,బాలికల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు.
అలాగే పోలీసు అధికారులు “డ్రగ్స్ వద్దు బ్రో” పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పారు. చీరాల పట్టణంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పోక్సో చట్టం పై కూడా విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని, ఏ రకమైన వేధింపులకు గురైన వెంటనే పోలీసులకు లేదా శిశు సంరక్షణ కమిటీకి ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. బాలికలు మాత్రమే కాదు, బాలుర రక్షణ కూడా ఈ చట్టం ద్వారా సమానంగా లభిస్తుందని అధికారులు తెలిపారు. పోలీసు శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ,
“సాంకేతిక యుగంలో పిల్లల భద్రత అత్యంత ముఖ్యమైన విషయం. శక్తి యాప్‌ను ప్రతి మహిళ, యువతి తప్పనిసరిగా ఉపయోగించాలి. డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా తరిమేయాలంటే ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. పోక్సో చట్టంపై ఉన్న అవగాహన, బాధ్యత అందరికీ ఉండాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసు శాఖ చేపట్టిన ఈ మూడు కార్యక్రమాలు మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, బాలల రక్షణ చట్టాలు సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కర్ణ. వీరప్రసాద్, టి. శోభాదేవి, ఎం. నిర్మలాదేవి మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.







