GUNTUR NEWS: పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలి
GUNTUR COMMISSIONER VISIT
గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు నిర్దేశిత సమయంలో విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆదివారం ఏ.టి అగ్రహారం, చుట్టుగుంట, కే.వి.పి కాలని, లాలుపురం రోడ్డు, అరండల్ పేట మరియు శంకర్ విలాస్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత ప్రజారోగ్యాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో పర్యవేక్షణ సౌలభ్యం కోసం శానిటరీ డివిజన్ల పెంపు చేసి, పారిశుధ్య పనులకు అవసరమైన సామాగ్రిని అందించామన్నారు. కార్మికులను డివిజన్ల వారీగా రేషనలైజేషన్ చేశామని, అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల లేక ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు ఉదయం మస్టర్ కి సకాలంలో హాజరవ్వడం, పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్మికులు తప్పనిసరిగా ఉదయం మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి అయ్యాక, ఇంటింటి చెత్త సేకరణ చేయాలన్నారు. మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రైన్లు, పరిసరాలు పరిశుభ్రం చేయాలని, పిన్ పాయింట్ ప్రోగ్రాం ప్రకారం పారిశుధ్య పనులు జరిగేలా చూడాలన్నారు. అలాగే రోడ్డు మార్జిన్లలో గార్బేజ్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డునకు తరలించాలన్నారు. అలాగే ప్రజలు రోడ్ల పై వ్యర్ధాలను వేయకుండా పర్యవేక్షణ చేయాలని, రోడ్లపై వ్యర్ధాలు ఎవరు వేస్తున్నది నిఘా పెట్టాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. అంతేకాక నగరంలో అనధికార జంతువధ నిషేధమని, ఎవరైనా మాంసం దుకాణం పెట్టాలంటే నగర పాలక సంస్థ నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, అనుమతి లేకుండా దుకాణాలు పెడితే వారి దుకాణాలు సీజ్ చేయాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు.