
అమరావతి, ఫిబ్రవరి 6:- గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ విద్యను ప్రజలకు చేరువ చేయడంలో మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నెల్లూరు జిల్లా చెముడుగుంట జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ శ్రీ ఎన్. సుబ్రహ్మణ్యం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన **‘శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు’**ను అందుకున్నారు. ఈ అవార్డు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS తెలిపారు.

దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయుల నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, గ్రామీణ విద్యాభివృద్ధికి చేసిన సేవల ఆధారంగా కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయగా, వారిలో సుబ్రహ్మణ్యం ఒకరిగా నిలవడం విశేషం.

ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు శ్రీ ఎస్.డి. షిబులాల్ స్థాపించిన శిక్షాలోకం సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో బెంగళూరులో నిర్వహించిన “InvokED 5.0: Mission to Movement” జాతీయ విద్యా సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. విజేతలకు విద్యా కార్యక్రమాల విస్తరణ కోసం రూ.10 లక్షల నగదు పురస్కారం కూడా ప్రకటించారు.
ఈ అవార్డును శిక్షాలోకం వ్యవస్థాపకులు శ్రీ ఎస్.డి. షిబులాల్, శ్రీమతి కుమారి శిబులాల్ చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS పాల్గొన్నారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లా చెముడుగుంట జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం, మొబైల్ సైన్స్ ల్యాబ్ (స్పేస్ ఆన్ వీల్స్), ఇండోర్–అవుట్‌డోర్ ఎగ్జిబిట్‌ల పునరుద్ధరణ, QR కోడ్‌లతో కూడిన డిజిటల్ వివరణలు, ఆస్ట్రో టూరిజం, STEM ఆధారిత ప్రయోగాత్మక అభ్యాసం, ‘బడ్డింగ్ సైంటిస్ట్స్’, INSPIRE అవార్డ్స్, రూరల్ చిల్డ్రన్ రీసెర్చ్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా సైన్స్ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.Amaravathi Local New
సుబ్రహ్మణ్యం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS, మొబైల్ సైన్స్ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన రవాణా ఖర్చులు తదితరాలకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “సైన్స్ అభివృద్ధికి సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం” అని తెలిపారు.










