ప్రకాశం జిల్లా:సింగరాయకొండ:10-10-25:-ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి అనంతరం బెల్లం కోటయ్య ప్రైవేట్ పొగాకు లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా తీవ్రమవడంతో పెద్దఎత్తున పొగాకూ నిల్వలు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని శుక్రవారం తెల్లవారుజామున వరకూ మంటల అదుపు పనులు కొనసాగించారు. ఇప్పటి వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదని అధికారులు వెల్లడించారు.
ఈ అగ్నిప్రమాదంలో కంపెనీకి కోట్లల్లో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా స్పష్టత కావాల్సిన అంశంగా ఉంది. పూర్తి వివరాలు కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? ప్రాణనష్టం జరిగిందా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.