
Tirupati:శ్రీకాళహస్తి, అక్టోబర్ 19:శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు దోష నివారణ పూజలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నిర్వహించారు. సహస్రలింగం వద్ద రూ.5 వేల విలువైన ప్రత్యేక రాహు–కేతు, కాలసర్ప దోష నివారణ పూజల్లో ఆమె పాల్గొన్నారు.దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం చేశారు. వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
తరువాత మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అక్టోబర్ 25 నుంచి “జాగృతి జనం బాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నాలుగు నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నదని, దీని విజయవంతం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాబోయే దీపావళి సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.







