
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట – జగ్గయ్యపేట పట్టణ మధ్యలో ఉన్న 304 ఎకరాల ఆయకట్టు కలిగిన ఊర చెరువు, గతంలో సాగునీటి మూలంగా, భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధానంగా నిలిచింది. చెరువును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో జగ్గయ్యపేట పురపాలక సంఘం తరఫున గట్టు నిర్మాణం, చెట్లు, లైటింగ్, కల్వర్టు నిర్మాణానికి టెండర్ వ్యవస్థ ద్వారా పనులు అప్పగించారు. అయితే ఈ పనుల్లో నాణ్యతా లోపాలు, అసంపూర్తి పనులు, అవగాహన లేని నిర్మాణాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి.
ఈ అభివృద్ధి కార్యక్రమానికి సుమారు రూ. 5 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. ఇందులో అల్ట్రా టెక్ సిమెంట్ సంస్థ యాజమాన్యం రూ. 1 కోటి నగదును అందించగా, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫౌండేషన్ ట్రస్టు (DMFT) నుండి రూ. 2 కోట్లు, పిహెచ్ విభాగం విజయవాడ నుండి రూ. 35 లక్షలు, యస్‌ఎఫ్‌టి ద్వారా మిగిలిన మొత్తాన్ని టెండర్ ఎగ్జిక్యూట్ చేసినట్లు సమాచారం.
అయితే ఈ అభివృద్ధి పనులు ప్రజల అభివృద్ధికి మార్గం కాకుండా, అవినీతి మరియు నాశి పనులకు వేదిక అయ్యాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టెండర్ దారుడు నిర్వహించిన పనుల్లో కేవలం రూ. 50 లక్షల విలువ గల నాణ్యతా లేని పనులు మాత్రమే పూర్తయ్యాయని స్థానికులు వాపోతున్నారు. గట్టులు పూర్తిగా నిర్మించకపోవడం వల్ల చిన్న వానలకే నీరు నిలవడం, చెరువు కట్టలు విరిగి వాహనదారులు ప్రమాదంలో పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
చెరువు పక్కనున్న రహదారులపై సరైన లైటింగ్ లేకపోవడం, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటకపోవడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల లోపం – ఇవన్నీ స్థానిక ప్రజలను తీవ్రంగా బాధిస్తున్నాయి. నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వస్తోంది. సంబంధిత అధికారులు టెండర్ దారుడితో కుమ్మకై నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా కోట్లాది రూపాయల పనులను కేవలం నామమాత్రంగా పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ఈ విషయంపై స్పందిస్తూ, “ప్రభుత్వం మరియు ప్రజల సొమ్ముతో కంచే చేను మేసినట్లుగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలకులు టెండర్ దారునికి రెడ్ కార్పెట్ వేసి దోచిపెడుతున్నారు” అని తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మిగిలిన టెండర్ నగదును చెల్లించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. కొంతమంది ఈ వ్యవహారంపై హైకోర్టును కూడా ఆశ్రయించారని సమాచారం. అభివృద్ధి పేరుతో అవినీతి, నిర్లక్ష్యంతో ప్రజలకు అవస్థలు కలిగిస్తున్న ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక విచారణ కమిటీ ద్వారా సంపూర్ణంగా విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్తులో చెరువుకి గండి పడే ప్రమాదం ఉండడంతో, పర్యావరణ పరిరక్షణ, భూగర్భజలాల పరిరక్షణ దృష్ట్యా ఈ చెరువు అభివృద్ధిని పూర్తి స్థాయిలో పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు, పార్టీలు హెచ్చరిస్తున్నాయి.










