
కార్మికుల సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు నిత్యం అండగా నిలుస్తున్న గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావును మళ్లీ తిరిగి గెలిపించి శాసనమండలికి పంపించాలని గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నపనేని శివాజీ విజ్ఞప్తి చేశారు. బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. లక్ష్మణరావు శాసనమండలిలోను, బయట కార్మికులు చేస్తున్న పోరాటాలకు అండదండలని ఇస్తున్నారని, అలాంటి వ్యక్తిని గెలిపించి శాసనమండలికి పంపించడం ద్వారా కార్మికుల సమస్యలను శాసనమండలిలో మాట్లాడేదానికి అవకాశం ఉందని అన్నారు. మార్చిలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో ఆటో డ్రైవర్లలోని పట్టభద్రులు మరియు వారి కుటుంబాలలోని పట్టభద్రులు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మణరావు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పోస్టర్లను ఆటోలకు అంటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, నాయకులు గంగాధర్, శ్రీనివాసరావు, సుభాష్, శంకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.







