
బాపట్ల: నవంబర్ 25:-సూర్యలంక బీచ్ వద్ద దుకాణాల తొలగింపుతో జీవనోపాధిపై మేఘాలు కమ్ముకున్నాయన్న ఆందోళనలో ఉన్న స్థానిక వ్యాపారులకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అండగా నిలిచారు. తమ సమస్యలను వ్యక్తిగతంగా తెలియజేయడానికి ఆయన నివాసానికి వచ్చిన వ్యాపారులను ఫోన్ ద్వారా సంప్రదించిన సతీష్ ప్రభాకర్, “మీరు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు… సమస్య ఉన్న చోటికే నేను వస్తాను” అంటూ ధైర్యం చెప్పారు.
సూర్యలంక సముద్ర తీరంలో దుకాణాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. జీవనోపాధి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినా, నాయకుడు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా తమ సమస్యను వివరించారు.వ్యాపారుల ఆందోళనలను ఓపికగా విన్న సతీష్ ప్రభాకర్, “మీ సమస్య నాకు తెలుసు… మీరు ఇబ్బంది పడొద్దు. నేను స్వయంగా వస్తాను” అని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు తానే స్వయంగా సూర్యలంకకు వచ్చి వ్యాపారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఆయన స్పందనతో స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.







