
బాపట్ల:డిసెంబర్ 13:-బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఎమ్మెల్యే నేరుగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు స్పందిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోజూ ఇవ్వాల్సిన కోడి గుడ్డు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు స్వీట్ అసలు పెట్టలేదని, స్నాక్స్, రాగి లడ్డు కూడా అందించడంలేదని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా భోజనం కూడా చాలీచాలకుండా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల మాటలు విన్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాఠశాల ప్రిన్సిపల్ సోమయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే మండిపడ్డారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలలో జరుగుతున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సోమయ్యపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.Bapatla Local News విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో సంబంధిత ఉద్యోగులు పూర్తిగా విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు.చిన్నపిల్లలకు ప్రభుత్వం కేటాయించిన స్నాక్స్, స్వీట్లు, రాగి లడ్డు ఇవ్వకపోవడం, మిగిలిన భోజనం కూడా తక్కువగా అందించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు హెచ్చరించారు.







