

ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నాల్గోశుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అన్ని మండల తహసిల్దారులతో వీక్షణ సమావేశం ద్వారా ఆమె మాట్లాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. మిగిలినవి సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, విచారించాలని ఆదేశించారు.
ప్రజల అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పీజీ ఆర్ఎస్ లో నమోదైన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలన్నారు. డిసెంబర్ ఒకటో తేదీన పింఛన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి తక్షణమే నగదు డ్రా చేసుకుని పింఛన్ పంపిణీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలన్నారు. ఒకటో తేదీన నూరు శాతం పింఛన్ నగదు పంపిణీకి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలన్నారు. ఇతర కారణాలతో లబ్ధిదారుడు అందుబాటులో లేకపోతే మిగిలిన నగదును సిబ్బంది తక్షణమే తిరిగి చెల్లించాలన్నారు.
బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు విడిపోతున్నాయని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గజిట్ నోటిఫికేషన్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శనకు ఉంచాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ పి.గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








