
విజయవాడ: డిసెంబర్ 22:-సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అన్నారు.

సోమవారం విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కే.వి. రావు గారి సహకారంతో ఏర్పాటు చేసిన “కే.వి. రావు సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్” కేంద్రాన్ని స్పీకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్పీకర్ మాట్లాడుతూ, దేశం వేగంగా డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో బ్యాంకింగ్, ఆరోగ్యం, పాలన వంటి కీలక రంగాలు టెక్నాలజీపై ఆధారపడుతున్నాయని తెలిపారు. నేరం జరిగిన తర్వాత నిజాన్ని వెలికితీయడంలో డిజిటల్ ఫోరెన్సిక్ కీలకమని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడంలో సైబర్ సెక్యూరిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకుని దేశ భద్రతకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్, న్యాయ వ్యవస్థతో పాటు ఐటీ రంగాల్లో సైబర్ నిపుణులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు ఇతరులతో పంచుకోకూడదని, లాటరీల పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే విశ్వసించాలని తెలిపారు.
ఈ సెంటర్ ద్వారా స్వర్ణాంధ్ర @2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారుVijayawada news.
ఈ కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ రాజు గారు (డిస్టింగ్విష్డ్ గెస్ట్), సిద్ధార్థ అకాడమీ మేనేజ్మెంట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







