ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు ఇండియా కూటమికి కనువిప్పు కలగాలని, గుణ పాఠాలు నేర్చుకోవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి మయంగా మారిన రాజకీయ పార్టీల నేతలపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ టాక్స్ లను పురిగొల్పి, భయపెట్టి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో హర్యానా, ఢిల్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడానికి అరవింద్ కేజ్రివాల్ జైలు నుండి బయటకు రావడానికి గల సంబంధాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఎంఐఎం బి ఎస్ పి పార్టీలు ప్రతి ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తూ ముస్లిం ఓటర్లను దళిత ఓటర్లను ఆకర్షించి ముస్లిం ఓట్లు ఇండియా కూటమికి పడకుండా చేసి బిజెపి రాజకీయ లబ్ది పొందుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పేర్కొనట్లుగా ఇండియా కూటమి ఘర్షణ పడుతూ ఉంటే బిజెపి రాజకీయ లబ్ది పొందుతుందన్నారు. వాజ్ పాయ్, ఆద్వానీల నేతృత్వంలో ఉన్న బిజెపి నేడు లేదని నేడు మోడీ, అమిత్ షా ల నేతృత్వంలో అధికారం పొందటమే లక్ష్యంగా పనిచేస్తూ సిబిఐ, ఈడి, ఐటీ లను ఆయుధాలుగా ఉపయోగిస్తుందన్నారు. వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న ఆదానీ, అంబానీ లను ,వేలాది కోట్ల రూపాయల అవినీతిపరులైన రాజకీయ నేతలను బిజెపి లో చేర్చుకుని వారికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. గాంధీజీ, నెహ్రూ లాంటి వారిని దేశద్రోహులుగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తూ దేశద్రోహులను, అవినీతిపరులనూ బిజెపి లో చేర్చుకుంటుందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవీ విరమణ చేసిన వెంటనే రాజ్య సభ సభ్యులుగా, గవర్నర్లుగా నియమిస్తూ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి సీనియర్ కేంద్ర మంత్రిని పెట్టడం ద్వారా ఎన్నికల కమిషనర్ల నియామకం రాజకీయంగా మారిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో లౌకిక, సోషలిస్ట్ దృక్పథం, ఫెడరల్ వ్యవస్థలను కాపాడాలంటే బిజెపి యేతర పార్టీలన్నీ ఐక్యం కావాలని, ఇండియా కూటమి బలపడాలని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ భావిస్తుందన్నారు.
239 1 minute read