
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు నారా లోకేష్, మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి, వారిలో ధైర్యాన్ని నింపారు.
గతేడాది కర్నూలు జిల్లా నన్నూరు వద్ద జరిగిన విషాదకర సంఘటనలో, విద్యుత్ షాక్ తగిలి మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎమ్. అర్జున్ మృతి చెందాడు. ఈ ఘటన పార్టీని, ఆ కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో, అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించిన మంత్రి నారా లోకేష్, వారితో ఆత్మీయంగా మాట్లాడారు.
అర్జున్ తండ్రి మద్దిలేటి, తల్లి రాణి, సోదరి కోమలిలను కలిసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబానికి ధైర్యం చెబుతూనే, అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను ఆరా తీశారు.Managalagiri news
“అర్జున్ లేని లోటు తీర్చలేనిది, కానీ ఆ కుటుంబ బాధ్యతను నేను తీసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి, జీవితాంతం మీకు అండగా ఉంటాను” అని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. తమ కష్టకాలంలో మంత్రి లోకేష్ చూపిన చొరవ, పలకరించిన తీరు అర్జున్ కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చాయి. తమను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.







