భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం టెక్నాలజీ ఆధారిత చర్యలు – రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
రాష్ట్రంలోని భూ వివాదాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ మేరకు ఆదార్, సర్వే నంబర్లను అనుసంధానం చేయడం ద్వారా, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ నమోదు ప్రక్రియను పారదర్శకంగా మలచేందుకు చర్యలు చేపట్టామని రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో రెవిన్యూ శాఖకు సంబంధించిన పది కీలక అంశాలపై సమీక్ష నిర్వహించగా, పలు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ:
ఆగస్టు 15 న 21 కోట్ల మందికి క్యూఆర్ కోడ్‌తో నూతనమైన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
వారసత్వ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేసినట్టు వెల్లడించారు. రూ.10 లక్షల లోపు భూములకు రూ.100, అంతకంటే పైబడి ఉన్న భూములకు రూ.1000 మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వేను బ్లాక్ మెథడ్స్ ద్వారా వేగవంతంగా నిర్వహించడంతో పాటు, అన్ని రకాల భూములను మ్యాప్ చేయనున్నట్లు తెలిపారు. ఈ రీ-సర్వేను 2027 డిసెంబరులోగా పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఫ్రీహోల్డ్ భూముల సమస్య పరిష్కారానికి సంబంధించి మంత్రుల ఉపసంఘం నాలుగు సమావేశాలు జరిపినదని, అక్టోబర్ 2 నాటికి తుది నివేదిక ఇవ్వనున్నదన్నారు.
నాలాల రద్దుపై కూడా సమీక్ష కొనసాగుతున్నదని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రెవిన్యూ అధికారులను ప్రోటోకాల్ డ్యూటీల నుండి మినహాయించి, ప్రత్యేక ప్రోటోకాల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షలో రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి. జయలక్ష్మి, అదనపు సిసిఎల్ఏ ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.