
గుంటూరు:వడ్లమూడి:నవంబర్ 8 :-“టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, న్యాయం యొక్క హృదయం మానవత్వం, నైతికత, దయలోనే ఉంటుంది,” అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ పరిధిలోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రో బోనో లీగల్ సర్వీసెస్ సహకారంతో ‘‘కృత్రిమ మేధస్సు మరియు సాంకేతిక యుగంలో న్యాయసహాయం – న్యాయం అందుబాటులోకి తేవడం’’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు శనివారం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన జస్టిస్ చలమేశ్వర్ గారు, యూనివర్సిటీ లోని ఎన్.టి.ఆర్. లైబ్రరీలో తన పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెక్షన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ,“ఏఐ మరియు టెక్నాలజీ న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పటికీ, అవి ఎప్పటికీ న్యాయమూర్తుల గాని, న్యాయవాదుల గాని స్థానాన్ని భర్తీ చేయలేవు. న్యాయ సారం మానవ ఆలోచన, నైతిక తీర్పు, దయలోనే ఉంటుంది,” అని అన్నారు.పేదవర్గాలకు న్యాయసహాయం అందించే దిశగా అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ సదుపాయాలు విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.“టెక్నాలజీ మానవతకు తోడ్పడాలి కానీ దానిని భర్తీ చేయకూడదు. 2050 నాటికి ఏఐ, బయోటెక్నాలజీ రంగాల్లో ఊహించలేని మార్పులు వస్తాయి, అయినా మానవ మనసు, దయ, న్యాయం – ఇవే సమాజాన్ని నిలబెడతాయి,” అని వ్యాఖ్యానించారు.

టెక్నాలజీ శక్తివంతమైన సాధనం – కానీ మానవ సేవలోనే విలువ : జస్టిస్ యు. దుర్గా ప్రసాద్ రావుగౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గా ప్రసాద్ రావు మాట్లాడుతూ,“టెక్నాలజీ ఒక శక్తివంతమైన సాధనం, కానీ దాని విలువ మానవ సేవలోనే ఉంది,” అని పేర్కొన్నారు.భారత న్యాయవ్యవస్థ వేగంగా డిజిటల్ మార్పులు సాధిస్తున్నదని, ఈ–కోర్ట్స్, పేపర్ ఫ్రీ కోర్ట్స్, ఆన్‌లైన్ కేసు ట్రాకింగ్ సిస్టమ్‌లు పారదర్శకతను పెంచుతున్నాయని వివరించారు.“ఏఐ మరియు డిజిటల్ సాధనాలు న్యాయ వ్యవస్థ సమర్థతతో పాటు ప్రజల శక్తివంతతకు దోహదపడాలి,” అని అన్నారు.నైతికతతో సమతుల్యం అవసరం : డాక్టర్ లావు రత్తయ్యవిజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ,ఏఐ ఇప్పుడు న్యాయసేవల్లో కీలక పాత్ర పోషిస్తోందని, డిజిటల్ లీగల్ అసిస్టెంట్లు, ఆన్‌లైన్ వివాద పరిష్కార వేదికలు ప్రజలకు సులభతర సేవలందిస్తున్నాయని తెలిపారు.అయితే, టెక్నాలజీతో పాటు నైతిక విలువలు, మానవ బాధ్యతలు, డేటా భద్రత వంటి అంశాలను కచ్చితంగా పరిగణించాలన్నారు.“ఏఐ మరియు చట్టం కలిసినప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది, న్యాయం ప్రజల హక్కుగా నిలుస్తుంది,” అని వ్యాఖ్యానించారు.న్యాయ సారాంశం మానవత్వం : ప్రొఫెసర్ పీ. నాగభూషణ్‌విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ మాట్లాడుతూ,“ఏఐ ఎంత అభివృద్ధి చెందినా, న్యాయ సారాంశం మానవత్వం, దయ, నైతిక బాధ్యతలలోనే ఉంది. టెక్నాలజీ న్యాయ వ్యవస్థకు సహాయకం మాత్రమే, భర్తీ చేయలేనిది,” అని పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.సదస్సులో విజ్ఞాన్ యూనివర్సిటీ డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







