
ఏలూరు, జనవరి 23:-తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో ఏర్పాటు చేసిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, గత వైసీపీ ప్రభుత్వ అనైతిక నిర్ణయాల వల్ల భారీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లను షట్‌డౌన్ చేసి బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై సుమారు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. వైసీపీ పాలనలో మొత్తం విద్యుత్ రంగానికి రూ.1.30 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సుమారు రూ.6 వేల కోట్లతో 220 కేవీ, 400 కేవీతో పాటు 132/33 కేవీ సబ్‌స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీఎస్ వంటి ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచి, బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని వెల్లడించారు.

నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందిస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మంత్రి పేర్కొన్నారు. సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు, పీఎస్పీల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీఈఆర్సీ విధించిన రూ.5 వేల కోట్ల భారాన్ని కూటమి ప్రభుత్వమే భరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో యూనిట్‌పై రూ.1.19 వరకు ఛార్జీలు తగ్గించే దిశగా కృషి చేస్తున్నామన్నారుEluru Local News.
వైసీపీ పాలనలో పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 10 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రైతుల భద్రత కోసం వ్యవసాయ భూముల్లో కవర్ కండక్టర్ల వినియోగంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుందనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు.










