
- Vignan’s University :The AP Space Tech Summit–2026 commenced grandly at Vignan’s University :అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల విప్లవం రావాలి
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026
- యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టీ.క్రిష్ణ బాబు
- స్పేస్ టెక్ ఉంటేనే దేశ అభివృద్ధి : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య
- విజ్ఞాన్స్‌లోనే ఉపగ్రహం తయారు చేయాలి : డాక్టర్ పావులూరి సుబ్బారావు
- ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది : ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు
- ప్రారంభమైన సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 పోటీలు
- ఏపీ స్పేస్ టెక్ అకాడమీ ‘స్పేస్ టెక్ స్పెక్ట్రమ్ జర్నల్’ ఆవిష్కరణ
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల విప్లవం రావాలని హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతరిక్ష సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదగడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్‌టెక్ అకాడమీ మరియు హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’’ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్‌ను ‘లెవరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష సాంకేతిక రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమ–అకాడెమీ కలయికలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో పబ్లిష్ చేసిన మొట్టమొదటి ‘‘స్పేస్ టెక్ స్పెక్ట్రమ్ జర్నల్’’ను అతిథులందరూ కలిసి ఆవిష్కరించారు. ఈ జర్నల్ అంతరిక్ష రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, రాష్ట్రంలో స్పేస్ ఎకానమీ అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రతిబింబించనుంది.
ప్రారంభమైన సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 పోటీలు
అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ‘‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’’ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వాలు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం వల్లే ప్రస్తుతం సుమారు 300 స్టార్టప్‌లు ఈ రంగంలో ఏర్పడి వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. మూడేళ్ల క్రితం వరకు మన దేశంలో కేవలం 3 నుండి 4 స్పేస్ స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, నేడు ఆ సంఖ్య 300కు చేరడం విశేషమని‘ ఆయన కొనియాడారు. అంతరిక్ష సంస్కరణల వల్ల ప్రైవేట్ రంగం ప్రవేశించిందని, 2040 నాటికి ప్రపంచ అంతరిక్ష ఉత్పత్తిలో భారత్ వాటా 10 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ స్టార్టప్‌లు ఉపగ్రహాల తయారీ, డేటా విశ్లేషణ, కమ్యూనికేషన్ సేవలు, నావిగేషన్ సాంకేతికత వంటి అనేక విభాగాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయని వివరించారు. ఈ పరిణామాలతో భారత్ ‘‘స్పేస్ యుబిక్విటీ’’ దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. భవిష్యత్తులో భూమి పరిశీలన ఉపగ్రహాలు (ఎర్త్ అబ్జర్వేషన్), సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్), నావిగేషన్ ఉపగ్రహాలు (నావిగేషన్ శాటిలైట్స్) దేశ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని చెప్పారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పు పర్యవేక్షణ, టెలికాం, ఇంటర్నెట్ సేవలు, ఈ–కామర్స్, రవాణా వంటి అనేక రంగాలకు అంతరిక్ష సాంకేతికత ఆధారంగా మారుతోందని పేర్కొన్నారు. దేశంలో అంతరిక్ష సాంకేతిక అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రధాన అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన ప్రముఖ సంస్థలు ఉన్నాయని, ఇవి దేశ అంతరిక్ష కార్యక్రమాలకు వెన్నెముకలా పనిచేస్తున్నాయని వివరించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అంతరిక్ష సాంకేతిక రంగానికి పునాదులు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు. శ్రీహరికోట వంటి ప్రపంచ స్థాయి ప్రయోగ కేంద్రం ఉండటం, పరిశోధన, విద్య, పరిశ్రమల మధ్య సమన్వయం ఉండటం రాష్ట్రానికి ప్రత్యేక బలమని అన్నారు. సమాచార ఉపగ్రహాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని, ‘‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’’ సాధనలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అలాగే నావిగేషన్ ఉపగ్రహాల ద్వారా రవాణా వ్యవస్థ, విమానయానం, నౌకాయానం, ఈ–కామర్స్, సరఫరా గొలుసు నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతోందని వివరించారు. విపత్తు నిర్వహణలో అంతరిక్ష సాంకేతికత కీలక ఆయుధంగా మారిందని స్పష్టం చేశారు. వరదలు, తుఫానుల వంటి సహజ విపత్తులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఉపగ్రహాల ద్వారా లభించే సమాచారం ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, యువ ప్రతిభ సహకారంతో రాష్ట్రం భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశానికి మార్గదర్శిగా నిలవగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం మరింత బలపడితే ప్రపంచ స్థాయిలో భారత్ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టీ.క్రిష్ణ బాబు

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టీ.క్రిష్ణ బాబు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రవేశించే యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. దేశంలోని టెక్నాలజీ పూల్‌లో ఏపీ వాటా 20 శాతం ఉందని, ఇది మన రాష్ట్ర యువత ప్రతిభకు నిదర్శనమన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో అంతరిక్ష సాంకేతికత కీలకం కానుందని, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ వంటి కీలక ఘట్టాలను ఆయన ఉదాహరిస్తూ, అంతరిక్ష విజ్ఞానం దేశ భద్రతకు ఏ విధంగా తోడ్పడుతుందో వివరించారు. అంతరిక్ష సాంకేతిక రంగం అనేక విభాగాలకు సేవలందించే అత్యంత కీలక రంగంగా మారిందన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పరిశోధన, ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్, ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సాంకేతికత వంటి విభాగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో అంతరిక్ష ప్రయాణం తొలి దశ నుంచే ప్రేరణాత్మకంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. కేరళలోని తుంబా కేంద్రం నుంచి తొలి రాకెట్ ప్రయోగం జరిగిన నాటి నుంచి నేటి వరకు భారత్ సాధించిన పురోగతి అత్యంత విశేషమని పేర్కొన్నారు.

తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని వివరించారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు దేశానికి గర్వకారణమని అన్నారు. చంద్రయాన్ ద్వారా చంద్రునిపై భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని చెప్పారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా సాగుతున్న గగన్‌యాన్ ప్రణాళిక దేశ శాస్త్రీయ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష రంగంలో ఆవిష్కర్తలకు, స్టార్టప్‌లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న సాంకేతికతలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి మద్దతు అందిస్తున్నాయని తెలిపారు. ఉపగ్రహాల రూపకల్పన నుంచి ప్రయోగం, డేటా సేవల వరకూ ప్రతి దశలో స్టార్టప్‌లకు విస్తారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ఉపగ్రహ ప్రయోగం ఒక అత్యంత సున్నితమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ అని వివరించారు. రాకెట్ తయారీ నుంచి కౌంట్‌డౌన్, ప్రయోగం, కక్ష్యలో ప్రవేశం వరకు ప్రతి క్షణం, ప్రతి అడుగు అత్యంత కీలకమని అన్నారు. చిన్నపాటి తప్పిదం కూడా మొత్తం ప్రయోగాన్నే ప్రభావితం చేయగలదని, అందువల్ల శాస్త్రవేత్తలు ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష సాంకేతిక రంగాన్ని భవిష్యత్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటోందని ఆయన తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో, మౌలిక వసతులు అభివృద్ధి చేయడంలో, యువతకు శిక్షణ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు.
స్పేస్ టెక్ ఉంటేనే దేశం అభివృద్ధి : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య
విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన ఉన్న చోట ఆ దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక నానుడిని గుర్తు చేస్తూ, స్పేస్ టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాకుండా, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మారిందని అన్నారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ శాస్త్రం, జల వనరుల నిర్వహణ వంటి అనేక రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. రైతులకు పంటల అంచనాలు, వాతావరణ హెచ్చరికలు, నీటి వినియోగంపై స్పష్టత ఇవ్వడంలో ఉపగ్రహ డేటా కీలకంగా మారిందన్నారు. ఈ విధంగా స్పేస్ టెక్నాలజీ సమాజానికి నేరుగా ఉపయోగపడుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని వివరించారు. అధ్యాపకులే భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే బాధ్యత వహిస్తారని చెప్పారు. స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీల కలయిక అత్యంత శక్తివంతమైన సమ్మేళనమని అభివర్ణించారు. ఈ మూడు రంగాలు ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉండటంతో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
విజ్ఞాన్స్‌లోనే ఉపగ్రహం తయారు చేయాలి : డాక్టర్ పావులూరి సుబ్బారావు
కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సీఎండీ మరియు విజ్ఞాన్స్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ విజ్ఞాన్స్ స్వయంగా ఉపగ్రహం తయారు చేయాలన్నారు. అంతరిక్ష సాంకేతికత ప్రతి సామాన్యుడికి చేరాలన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులే సొంతంగా ఒక శాటిలైట్‌ను తయారు చేసి ప్రయోగించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. 5జీ సాంకేతికతను క్యాంపస్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నామని, క్వాంటం కంప్యూటింగ్ మరియు స్పేస్ టెక్ కలయిక అద్భుతాలను సృష్టిస్తుందని తెలిపారు. స్పేస్ టెక్నాలజీ ప్రతి వ్యక్తికి చేరేలా డిజిటల్ హైవేలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ హైవేల ద్వారా సమాచార ప్రవాహం వేగవంతమై, పాలనలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అగ్రస్థానం సాధించాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలో భారతదేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 5జీ సేవలు మొదటగా విజ్ఞాన్స్ క్యాంపస్ మరియు వడ్లమూడి ప్రాంతానికి రావడం గర్వకారణమని చెప్పారు. అనంతరం అమరావతికి ఈ సేవలు విస్తరించడం రాష్ట్రంలో సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. స్పేస్ టెక్నాలజీ దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ రంగంలో పెట్టుబడులు మరింత పెరగనున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, 5జీ కమ్యూనికేషన్, స్పేస్ టెక్ కలిసి దేశాన్ని కొత్త దిశగా నడిపిస్తాయని అన్నారు.
ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది : ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలపై లభించే వనరులను కూడా భవిష్యత్తులో వినియోగించుకోవచ్చని అన్నారు. అలా చేస్తే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు అన్నారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందినా, నేడు అంతరిక్ష రంగంలో సాధించిన పురోగతితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. దేశంలో ఉన్న అపారమైన విద్యావంత యువతే భారత్‌ను నిజమైన సూపర్ పవర్‌గా మార్చిందని వ్యాఖ్యానించారు. యువతలో ఉన్న ప్రతిభను సరైన దిశలో వినియోగిస్తే అంతరిక్ష రంగంలో మరింత అద్భుతమైన విజయాలు సాధించవచ్చని తెలిపారు.
సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 ప్రధాన ఆకర్షణ
సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ‘‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా చిన్న రాకెట్ల నమూనాలను రూపకల్పన చేసి, తయారు చేసి, లాంచ్ చేయడం ద్వారా రాకెట్ డిజైన్, ఏరోడైనమిక్స్, ప్రోపల్షన్, ఫ్లైట్ స్టెబిలిటీ వంటి అంశాలపై ప్రాయోగిక అవగాహనను పెంపొందించారు.
రాకెట్ యొక్క రేంజ్, ఎత్తు, స్థిరత్వం, డిజైన్ ఇన్నోవేషన్, సేఫ్టీ ప్రోటోకాల్ వంటి ప్రమాణాల ఆధారంగా విజేతలను నేడు ఫైనల్ ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికేట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు.
ఆకట్టుకున్న సాంకేతిక సెషన్లు
సమ్మిట్ తొలి రోజు ప్రసంగాల అనంతరం నిర్వహించిన సాంకేతిక సెషన్లు, ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత బలం చేకూర్చాయి. అంతరిక్ష సాంకేతికతపై కేవలం సిద్ధాంత పరమైన చర్చలకే కాకుండా, ఆచరణాత్మక అనువర్తనాలు, పరిశోధన అవకాశాలు, పరిశ్రమ అవసరాలపై కూడా విస్తృతంగా చర్చ జరగడం ఈ సమ్మిట్ ప్రత్యేకతగా నిలిచింది.
ఇస్రో, డీఆర్‌డీవోతో పాటు ప్రముఖ అంతరిక్ష పరిశ్రమలకు చెందిన నిపుణులు వివిధ అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌ను స్పేస్ అప్లికేషన్లలో ఎలా వినియోగిస్తున్నారనే అంశంపై జరిగిన చర్చలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. రిమోట్ సెన్సింగ్, జియో స్పేషల్ టెక్నాలజీలు, స్పేస్ రోబోటిక్స్, స్పేస్ మెడిసిన్ వంటి అంశాలపై నిర్వహించిన సెషన్లు అంతరిక్ష రంగంలోని విస్తృత అవకాశాలను ప్రతిబింబించాయి.
స్పేస్ టెక్నాలజీ వ్యవసాయం, వాతావరణ అంచనాలు, విపత్తుల నిర్వహణలో ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే అంశంపై నిపుణులు వివరించారు. పంటల ఆరోగ్యాన్ని అంచనా వేయడం, నీటి వనరుల నిర్వహణ, వరదల ముందస్తు హెచ్చరికలు, తుపానుల మార్గ నిర్ధారణ వంటి అంశాల్లో ఉపగ్రహ డేటా వినియోగాన్ని ఉదాహరణలతో వివరించారు. ఈ చర్చలు విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీపై ఆసక్తిని మరింత పెంచాయి.
ప్రత్యేక ఆకర్షణగా స్టార్టప్ ప్రదర్శనలు
సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన స్టార్టప్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న పలు స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. రాకెట్ డిజైన్, ఉపగ్రహ భాగాల తయారీ, డేటా అనలిటిక్స్, స్పేస్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిష్కారాలు పరిశ్రమ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. పరిశ్రమ–విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు ఈ ప్రదర్శనలు ఉపయోగపడ్డాయి. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్పేస్ ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన నమూనాలు ప్రదర్శించబడ్డాయి. చిన్న ఉపగ్రహాల మోడళ్లు, రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లు, డేటా సేకరణ పద్ధతులు వంటి ప్రాజెక్ట్‌లను పరిశ్రమ నిపుణులు పరిశీలించి సూచనలు చేశారు. ఇది విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశాన్ని కల్పించిందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.
సమ్మిట్‌లో భాగంగా పాలసీ అంశాలపై కూడా చర్చలు జరిగాయి. స్పేస్ పాలసీ, స్పేస్ సెక్యూరిటీ, స్పేస్ ఎకానమీ వంటి అంశాలపై నిర్వహించిన ప్యానెల్ చర్చలు భవిష్యత్తు దిశను సూచించాయి. రాష్ట్రం మరియు దేశం కోసం అంతరిక్ష రంగంలో రూపొందించాల్సిన రోడ్‌మ్యాప్‌పై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. స్పేస్ రంగంలో ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ రంగం పాత్ర, పెట్టుబడుల అవకాశాలపై స్పష్టత కలిగించేలా ఈ చర్చలు సాగాయి.
కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ.క్రిష్ణ బాబు, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సీఎండీ మరియు విజ్ఞాన్స్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, వర్సిటీ అడ్వైజర్, మాజీ డీజీపీ మాలకొండయ్య, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు. అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.











