
బాపట్ల : చీరాల :23-10-25:-తీర ప్రాంతంలో ఇటీవలి వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చీరాల వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు సముద్రం ఉప్పొంగిపోతూ అలలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావంతో తీరప్రాంతంలో గట్టులు, ఇసుక తిన్నెలు దెబ్బతింటూ పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో తీరప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద సూచనా బోర్డులు, హెచ్చరిక ఫ్లెక్సీలు అమర్చినట్లు సమాచారం.

స్థానిక వీఆర్వో ఫక్రుద్దీన్, రెవెన్యూ అధికారులు శివన్నారాయణ, సాగర్ మిత్ర లక్ష్మీనారాయణ తదితరులు ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. అదేవిధంగా పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని సముద్రంలోకి తరలించే చర్యలు కూడా అధికారులు చేపట్టారు.
పర్యాటకులు, స్థానికులు సముద్రానికి దగ్గరగా వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.మెరైన్ కానిస్టేబుళ్లు, స్థానిక వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో తీరప్రాంతంలో నిరంతరం పహారా నిర్వహిస్తూ ప్రజల భద్రతపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.తీరప్రాంత ప్రజలు జాగ్రత్త — అలలు ఎగసిపడుతున్నాయి” అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.







