
విజయవాడ, నవంబర్ 7 :-మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన పి. ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని తెలిపారు. పత్తి రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు చేసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు.కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఉల్లి మద్దతు ధర రూ.1200గా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, 3వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి, వారిలో 500 మందికి మాత్రమే చెల్లింపులు జరిపినట్లు ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 26న వామపక్ష పార్టీలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు సురేంద్రరెడ్డి, ఎ. రామ్మోహనరావు, బి. సత్యనాయుడు, జి. రాత్రెడ్డి, కె. మధుసూదనరావు, పోతిన సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.







