
బాపట్ల: 29.10.2025:-బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నీట మునిగిన ప్రాంతాల్లో నీటి తరలింపు చర్యలను సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.బుధవారం పర్చూరు వాగు వద్ద వరద ఉధృతి పరిస్థితిని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

తుఫాన్ ప్రభావంతో పర్చూరు, నాగులపాలెం గ్రామాలు వరదముంపుకు గురికావడంతో చీరాల–చిలకలూరిపేట హైవే పర్చూరు వద్ద సుమారు 10 మీటర్ల వెడల్పులో రెండు చోట్ల కాలువలు త్రవ్వించి నీటిని దిగువకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టారు.అలాగే, పర్చూరు–ఉప్పుటూరు రహదారి మీదుగా వాగు నీరు ప్రవహిస్తున్నందున ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తదుపరి, కారంచేడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, పర్చూరు వాగు ప్రవాహ పరిస్థితిని మ్యాప్ ద్వారా పరిశీలించారు. వాగు ఉధృతంగా ఉన్న కారణంగా పరివాహక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అంతేకాకుండా వాగు నీటిని పొలాల వైపు మళ్లించేలా తగిన ఇంజినీరింగ్ చర్యలు తీసుకోవాలని కారంచేడు తహసిల్దార్, చీరాల డ్రైనేజీ సబ్‌డివిజన్-2 డివిజనల్ ఇంజినీర్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్శనలో పర్చూరు మండల ప్రత్యేక అధికారి లవన్న, నేషనల్ హైవే డి.ఇ. శ్రీనివాసరావు, చీరాల డ్రైనేజీ సబ్‌డివిజన్ నెం.2 డి.ఇ. మల్లికార్జునరావు, పర్చూరు తహసిల్దార్ బ్రహ్మయ్య, కారంచేడు తహసిల్దార్ నాగరాజు, డ్రైనేజీ శాఖ ఏ.ఇలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.







