విజయవాడ, సెప్టెంబర్ 21:తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నేపధ్యంలో నిత్యాన్నధాన కార్యక్రమానికి విజయవాడ సురక్ష కమిటీ, వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల లారీని విరాళంగా పంపించారు. ఈ లారీని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి దంపతులు పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభించారు.
ఈ రోజు కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో, నిత్యాన్నధానం కోసం విరాళంగా ఇచ్చిన కూరగాయల లారీని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య, వెంకటేశ్వర భక్త సమాజ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:
“తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది భక్తులకు అన్నదానం చేయడం పరంపరగా కొనసాగుతోంది. ఇందుకోసం అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ రోజు విజయవాడ సురక్ష కమిటీ, వెంకటేశ్వర భక్త సమాజం తరఫున 10 టన్నుల కూరగాయలను టిటిడి నిత్యాన్నధానానికి అందిస్తున్నారు. ఇదొక విశేషమైన సేవా కార్యక్రమం,” అని పేర్కొన్నారు.
అలాగే, నగర భద్రతకు కూడా సురక్ష కమిటీలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. “ప్రస్తుతం నగరంలో దాదాపు 10 వేల సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఈ కమిటీలు ముఖ్యపాత్ర వహించాయి. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న సురక్ష కమిటీని అభినందిస్తున్నాను. అన్నదానం అత్యంత శ్రేష్ఠమైన దానం. అందుకే దీనికి చాలామంది ముందుకు వస్తున్నారు,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్., బొప్పన మహీనాథ్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, సురక్ష కమిటీ సభ్యులు, భక్త సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.