
తెనాలి, ఫిబ్రవరి 8:– పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండనీయమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశం రాజకీయాలకు అతీతమై కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయమని స్పష్టం చేశారు.

తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సీబీఐ నివేదిక స్పష్టమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. 60 లక్షల లీటర్లుగా చెప్పబడిన నెయ్యిలో ఒక్క చుక్క అసలు నెయ్యి కూడా లేదని నివేదిక తేల్చిన తరువాత కూడా వైసీపీ నాయకులు ఎదురుదాడి ధోరణితో మాట్లాడటం నైతికతకు విరుద్ధమని మంత్రి విమర్శించారు.
అయోధ్యకు పంపిన లడ్డుల కోసం “ప్రత్యేక నెయ్యి వాడాం” అని వైసీపీ నాయకులు చెబుతున్న మాటలే, తిరుమలలో వాడుతున్న నెయ్యి అసలు నెయ్యి కాదన్న విషయం వారికి ముందే తెలుసన్నదానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ప్రత్యేకంగా నెయ్యిని తెప్పించారంటే, ఐదేళ్ల పాటు మిగిలిన లడ్డుల తయారీలో ఉపయోగించిన పదార్థాల విషయంలో ప్రజలను ఎలా మోసం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని ఒక డైరీ సంస్థ నుంచి 1005 కిలోలు, పలమనేరులోని మరో సంస్థ నుంచి 1005 కిలోల నెయ్యిని అయోధ్య లడ్డుల కోసం తెప్పించామని చెప్పడం మరింత బాధాకరమన్నారు. తిరుమల లడ్డులు అన్నీ తిరుమలలోనే తయారవుతాయని, వేర్వేరు ప్రాంతాల నుంచి వేర్వేరు పదార్థాలు పంపించి లడ్డులు తయారు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగత దాడులుగా మలచే ప్రయత్నాలను సమాజం గమనించి ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడడమే తప్ప ఇతర మతాలను కించపరచడం కాదని స్పష్టం చేశారు.
తిరుమలలో జరిగిన ఈ తప్పిదంపై సమగ్ర ప్రక్షాళన జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుని మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, సమాజంలోని బాధ్యతగల వ్యక్తులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పు జరిగిందని అంగీకరించి భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాల్సిన వారు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడికి దిగడం దురదృష్టకరమన్నారు. తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లోనూ లడ్డు సరఫరా ద్వారా భక్తుల మనోభావాలకు దెబ్బ తగిలిన అంశాన్ని గుర్తించి సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు.Tenali lo ration sarukulu: తెనాలిలో రేషన్ సరుకులు పంపిణీ చేసిన మంత్రి మనోహర్
“ధర్మాన్ని కాపాడటం అంటే ద్వేషం కాదు… భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.










