
టొరంటో/ఓషావా:కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కాన్సెప్ట్‌తో ప్రతివారం వేడుకలా జరిగే “డీటీసీ ఫ్యామిలీ ఫెస్ట్ 2025” ఈసారి మరింత అట్టహాసంగా టొరంటో ఓషావాలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించారు. 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేసిన ఈ వేడుక ప్రాంగణం నిండా తెలుగు సంబురం వెల్లివిరిసింది.కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల, సంతోష్ కుంద్రు అలరించగా, యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల ఆకట్టుకున్నారు. ప్రారంభంలో డీటీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం కెనడా జాతీయ గీతం, ‘మా తెలుగు తల్లి’తో సభా వేదిక కళకళలాడింది.
తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి. చిన్నారుల నృత్యాలు, యువత సంగీతం, సంప్రదాయ కళారూపాలు విశేషంగా అలరించాయి. డీటీసీ కుకింగ్ షో, కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు గ్రాండ్ స్పాన్సర్ Advanced Physio నుండి తూసి వినయగమూర్తి బహుమతులు అందజేశారు.కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు మాట్లాడుతూ, “కెనడాలో తెలుగు సంస్కృతిని నిలబెట్టడంలో ఇటువంటి వేడుకలు ఎంతో ముఖ్యమైందిగా నిలుస్తాయి” అని అభిప్రాయపడ్డారు.ఈ వేడుకకు విశిష్ట అతిథిగా హాజరైన సెయింట్ మైకేల్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ హెడ్ డా. బాబీ యానగావా కుటుంబ ఆరోగ్యం, గుండె ఆరోగ్యంపై ముఖ్య సూచనలు అందించారు. తర్వాత డీటీసీ ఎక్సలెన్సీ అవార్డులను డా. యానగావా, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల అందజేశారు. కమ్యూనిటీ సర్వీస్ అవార్డు – ఉషా నడుఱి, ఆర్ట్స్ & క్లాసికల్ డాన్స్ అవార్డు – చిన్నారి శిరి వంశికా చిలువేరు, ఆర్ట్స్ & సింగింగ్ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాల అందుకున్నారు.కార్యక్రమ విజయానికి కీలకంగా నిలిచిన స్పాన్సర్లలో గ్రాండ్ స్పాన్సర్ తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్ సింప్లీ సౌత్ – ఓషావా, సిల్వర్ స్పాన్సర్స్‌గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ, రఘు జులూరి, భారత్ లా తదితరులు ఉన్నారు. అదనంగా Advanced Physio, డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్, సివమ్మ టిఫిన్స్, బండీ మేడు బజ్జి, నమస్తే ఇండియా సూపర్ మార్కెట్, షోబీ డెకోర్స్, పవన్ PK ఫోటోగ్రఫీ సహకరించారు.టొరంటో పరిసర ప్రాంతాల తెలుగు సంఘాలు—DTA, OTF, BFC, TTC, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్, డర్హమ్ హైదరాబాదీ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై డీటీసీ సేవలను అభినందించారు.తెలుగు ఇంటి వంటలతో, తినుబండారాలతో సింప్లీ సౌత్ – ఓషావా అందించిన భోజనం మన ఊరి రుచులను గుర్తుచేసేలా నిలిచింది. 20కి పైగా బహుమతులతో నిర్వహించిన రాఫెల్ డ్రా సందడి మరింత పెంచింది.డీటీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ, “తెలుగు సంస్కృతిని ఎక్కడ ఉన్నా గౌరవంగా నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత. అదే తత్వంతో ఈ ఫ్యామిలీ ఫెస్ట్ ఘన విజయం సాధించింది” అని తెలిపారు.కార్యక్రమం ముగింపులో కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు, స్పాన్సర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.







