
విశాఖపట్నం: ఆనందపురం కూడలిలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్.హెచ్.ఎ.ఐ (NHAI), పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి వారు ఆనందపురం కూడలిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.
ముఖ్యంగా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న పూల మార్కెట్‌ను రైతు బజార్‌కు కేటాయించిన 95 సెంట్ల స్థలంతో పాటు, పక్కనే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ స్థలానికి తరలించే అంశంపై చర్చించారు. అలాగే, ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని విస్తరించి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పరిస్థితులను సూక్ష్మంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.http://VISHAKAPATNAM NEWS







