
హైదరాబాద్, అక్టోబర్ 30:దేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ట్రైబల్ కానో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్‌లో తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ అన్నారు.హుసైన్‌సాగర్‌లో గురువారం జాతీయ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ట్రైబల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లలో శిక్షణ పొందిన అండర్–16 మరియు అబోవ్–16 వయస్సు గల బాలురు, బాలికలు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని వివరించారు.

ఈ పోటీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని గణేష్ నాగరాజన్ తెలిపారు.ఈ సందర్భంగా సాట్స్ కోచ్ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వగలిగిందన్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని ఆయన అభినందించారు.






