AP WhatsApp Governance: ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్ గవర్నెన్స్
మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను. ఈ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తోంది, క్యాబ్ వస్తుంది, ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా. అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించడం జరిగింది అన్నారు.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు
వాట్సప్ గవర్నెన్స్ కు 36 శాఖలను అనుసంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్ గవర్నెన్స్. రియల్ టైంలో ధృవపత్రాలు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్ సైట్ కు ఆ లింక్ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.