
కృష్ణా: గుడివాడ:-నేటి యువతరం ఆధునికతలో ఎంత ముందుకు సాగుతున్నా ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మవిభూషణ్, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కైకలూరు, గుడివాడ ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము పాల్గొన్నారు.

కార్యక్రమానికి వచ్చిన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, నాట్స్, ఐఎంఏ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసి సభను వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తన బాల్య జీవనశైలిని సభ ముఖంగా గుర్తు చేసుకున్నారు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచే గుడివాడ తనకు ఎంతో ఇష్టమని, విద్యార్థి ఉద్యమ సమయంలో ఇక్కడికి తరచూ వచ్చేవాడినని చెప్పారు. కన్నతల్లి, జన్మభూమిని మర్చిపోకుండా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని సూచించారు.

విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో లభించే ఆనందం అపారమన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కొత్త రుగ్మతలు వస్తున్నాయని, ప్రకృతి సమతుల్యత క్రమంగా కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.Krishna District: “Recalling Chandrababu, Babu Surety Fraud Guarantee” program at K. Convention Hall in Gudivada, YSRCP constituency వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని, సేవా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు.
స్మార్ట్‌ఫోన్లు, విద్యుత్ పరికరాల అధిక వినియోగం, జంక్ ఫుడ్ అలవాట్లు ఆరోగ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని, ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. నేటి యువతరం కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడకు వచ్చిన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. విలువలతో చేసే ప్రతి కార్యక్రమంలో అందరి పాత్ర అవసరమన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సమాజానికి ఇవ్వడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. గుడివాడ వైద్యులు ప్రజాసేవలో ముందుండటం గర్వకారణమన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రాము, నాట్స్ ప్రతినిధులు, గుడివాడ ఐఎంఏ పెద్దలు వెంకయ్య నాయుడిని ఘనంగా సత్కరించారు. శిబిరాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు వైద్య సేవలను పరిశీలించారు. ఈ శిబిరంలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటరావు, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, గుడివాడ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, చేకూరు జగన్మోహన్‌రావు, ఐఎంఏ పెద్దలు డాక్టర్ మన్నెం భవానీ శంకర్, డాక్టర్ పాలడుగు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.







