
బాపట్ల, జనవరి 19, 2026:– ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి. అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఉపాధి హామీ పనులు జరగాలని, నిరుపేద కుటుంబాలకు క్రమం తప్పకుండా ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. కొత్తగా నమోదైన కుటుంబాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. జలశక్తి అభియాన్ కింద 2,583 పనులు మంజూరు కాగా ఇప్పటివరకు కేవలం 936 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అధికారులను ప్రశ్నించారు. అలాగే జల సంచయ జనభాగీదారి పథకం కింద మంజూరైన 2,266 పనుల్లో 50 శాతం కూడా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

పల్లె పండుగ అభివృద్ధి పనులకు 75 శాతం అధికారిక ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కాల్వల మరమ్మతు పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే నీరు భూమిలోకి ఇంకేలా 1,800 ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు.Bapatla Local News
సేంద్రియ ఎరువుల గుంతల నిర్మాణంలో తీవ్ర వెనుకబాటు ఉందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 28,400 సేంద్రియ ఎరువుల గుంతలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 4,000 మాత్రమే మంజూరు చేయడం, అందులోనూ 1,565 మాత్రమే పూర్తవడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే పశువుల కోసం 414 షెడ్లు నిర్మించాల్సి ఉండగా 40 శాతం కూడా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో ఒక గ్రామానికి వారానికి ఒక షెడ్డు నిర్మించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు.

గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని, 10 భవనాలు మంజూరైతే కేవలం నాలుగు మాత్రమే ప్రారంభమవడం ఎందుకని అధికారులను నిలదీశారు. మొక్కల నాటకంలో కూడా లక్ష్యాలు పూర్తి కావడం లేదని, 236.96 ఎకరాల్లో నాటాల్సిన మొక్కలు ఇప్పటివరకు 187.27 ఎకరాల్లో మాత్రమే నాటడం జరిగిందన్నారు. మునగ మొక్కలు 5,814 నాటాల్సిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని సూచించారు. పంట కాల్వల వెంట కొబ్బరి మొక్కలు నాటే పనుల్లోనూ మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రహదారుల వెంట మిగిలిన మొక్కలు వెంటనే నాటాలని తెలిపారు.
గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రతి లబ్ధిదారుడికి 90 పని దినాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. నగరం మండలంలో కేవలం 62 శాతం పురోగతి మాత్రమే ఉండడంపై ఆరా తీశారు. పునాది దశ నుంచి లెంటిల్ దశకు, లెంటిల్ దశ నుంచి స్లాబ్ దశకు, స్లాబ్ దశ నుంచి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో లక్ష్యంగా పెట్టుకున్న 341 గృహాల్లో 254 గృహాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డ్వామా ఏపిడీ శ్రీమన్నారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్‌తో పాటు ఎంపీడీవోలు, ఏపీడీలు తదితర అధికారులు పాల్గొన్నారు.










