బాపట్ల, అక్టోబర్ 8:వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. బుధవారం పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో పఠాన్ ఆయేషా తపశాం ప్రథమ బహుమతిని గెలుచుకోగా, సుమియా కౌశిక్ ద్వితీయ బహుమతి, రేష్మానిషా తృతీయ బహుమతిని పొందారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కృషితో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. “సామాజిక స్పృహతో ఎదిగి, ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఉత్తమ మార్గం. మీరు గ్రూప్-1 అధికారులుగా ఎదగాలని ఆశిస్తున్నా,” అని తెలిపారు.
తన అనుభవాలను పంచుకుంటూ కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, “పదోతరగతిలో 580 మార్కులతో కర్ణాటక రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించాను. ప్రజలకు ఎక్కువ సేవలు అందించాలనే ఆలోచనతో ఐఏఎస్ మార్గాన్ని ఎంచుకున్నాను,” అన్నారు. విద్యార్థులు చక్కటి ప్రణాళికతో చదువులో శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
జీఎస్టీ తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గి, వినియోగం పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వివరించారు. “తలసరి ఆదాయం పెరగడం, ఉత్పత్తుల వృద్ధి ఇందు ద్వారా సాధ్యమవుతాయి. జీఎస్టీ పన్ను విధానం ప్రజలకు మేలు చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది,” అని తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రస్తుతం ఐదు శాతం, 18 శాతం మాత్రమే జీఎస్టీ పన్నులు వర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు 70 శాతం ఆదాయం పన్నుల ద్వారానే లభిస్తుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల తాత్కాలికంగా నష్టం వచ్చినా, దీర్ఘకాలంలో ప్రజలకు మేలు జరుగుతుంది,” అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతమే అన్ని రంగాలకు నాంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ జి. గ్లోరికుమారి, నోడల్ ఆఫీసర్ గౌరీదేవి, కళాశాల ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, ఉప ప్రిన్సిపాల్ సుబ్బారావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.