
గుంటూరు: నవంబరు 11:-గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో రూ.1.20 కోట్ల వ్యయంతో 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన చెరువును మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.కొండవాగు ప్రవాహం ఈ చెరువుకు ప్రధాన నీటి వనరుగా ఉందని అధికారులు వివరించారు. అనంతరం మంత్రులు స్థానిక విఘ్నేశ్వరుడు, పోలేరమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించి, నక్షత్రవనంలో మొక్కలు నాటారు. పునరుద్ధరించిన బావి, పిల్లల పార్కు, వ్యాయామ పార్కు, ఓపెన్ ఎయిర్ థియేటర్లను పరిశీలించారు.

మీడియాతో మాట్లాడుతూ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ –“సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారం” అన్నారు.జల సంరక్షణ, వాటర్ షెడ్ ప్రోగ్రాం, ప్రధాన మంత్రి సించయతీ యోజన వంటి కార్యక్రమాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశ వ్యాప్తంగా అమలు అవుతున్నాయని తెలిపారు.వెంగళాయపాలెంలో పునరుద్ధరించిన ఈ పురాతన చెరువు జల సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. “ఇటువంటి చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు, మట్టి సారవంతతకు, పర్యావరణ సమతౌల్యానికి దోహదం చేస్తాయి. దీని ఫలితంగా సుస్థిర ఆర్థికాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, సాంస్కృతిక వికాసం సాధ్యమవుతుంది” అని చెప్పారు.ఈ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా స్ఫూర్తిదాయక అడుగులు వేస్తున్నారు” అని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, కేంద్ర భూవనరుల కార్యదర్శి మనోజ్ జోషి, రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎం. శశిభూషణ్ కుమార్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకులు మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, వాటర్ షెడ్ సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, జాయింట్ కమిషనర్ శివరాం తదితరులు పాల్గొన్నారు.







