
బాపట్ల జిల్లా; వేటపాలెం:13-11-25:-వేటపాలెం మండలంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్ వద్ద గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను దగ్ధం చేసి పరారైన ఘటన చోటుచేసుకుంది.సమీప ప్రాంత నివాసులు మంటలు ఎగసిపడుతున్నట్లు గమనించి వెంటనే రైల్వే గార్డ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే గార్డ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి పై అధికారులకు తెలియజేశారు. అనంతరం రైల్వే అధికారులు కూడా అక్కడికి చేరుకొని దగ్ధమైన వైర్లను పరిశీలించారు.
ఈ ఘటనపై రైల్వే భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వెనుక కారణాలు, నిందితుల వివరాలపై విచారణ కొనసాగుతోంది.ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఆకతాయిలు మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా రైల్వే అధికారులు భద్రతా చర్యలను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.







