
మండపేట, ఫిబ్రవరి 5 (2026):-విద్యుత్ శాఖపై ప్రజల్లో 95 శాతం సంతృప్తి స్థాయి సాధించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మండపేట నియోజకవర్గంలోని మండపేట, టేకి గ్రామాల్లో ఒక్కోటి రూ.2.61 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఎక్కడా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణం, టెండర్ దశల్లో ఉన్నాయని వివరించారు.
ఒక్కో యూనిట్‌కు రూ.1.19 తగ్గింపు లక్ష్యం:
ఆర్డీఎస్ఎస్ పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో రూ.175 కోట్లతో విద్యుత్ మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆర్టీఎస్ఎస్ పనుల ద్వారా ఫీడర్ల బైఫరికేషన్ జరుగుతోందని, దీని వల్ల రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వినియోగదారులకు 24 గంటల సరఫరా అందుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 75,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి జరగలేదని విమర్శించిన మంత్రి, ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై రూ.30 వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇప్పుడు అదే వైసీపీ నేతలు తమ పెంపులపైనే ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు.
Amaravathi local Newsడిసెంబర్లో ఏపీఈఆర్సీ విధించిన రూ.5 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా కూటమి ప్రభుత్వమే భరించిందన్నారు. వైసీపీ ట్రూ అప్ చేసిన 40 పైసల్లో ఇప్పటికే 13 పైసలు ట్రూ డౌన్ చేశామని, మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో తగ్గిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ఒక్కో యూనిట్‌కు రూ.1.19 తగ్గించేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారని వెల్లడించారు.
వైసీపీ నేతలపై విమర్శలు:
వైసీపీ నేతలు అభ్యంతరకర భాషతో తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. గొడవలు సృష్టించి ప్రజల్లోకి వెళ్లాలన్నది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహమని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. రూ.33 వేల కోట్లతో పెన్షన్లు, మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా పిల్లల కోసం తల్లుల ఖాతాల్లో రూ.10,000 కోట్లను జమ చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కూటమి నేతలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.










