
కుక్కునూరు:-పోలవరం ప్రాజెక్టు కారణంగా సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని చట్టసభలో గట్టిగా ప్రశ్నిస్తానని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి స్పష్టం చేశారు.

మంగళవారం కుక్కునూరు మండలంలోని పలు విద్యాసంస్థలను ఆయన సందర్శించారు. 2024 డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి తనను చట్టసభకు పంపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ‘కృతజ్ఞత పర్యటన’గా మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.Eluru Local News :ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నుంచి భారీగా చేరికలు
ఈ పర్యటనలో భాగంగా సీఐటీయూ అనుబంధ లారీ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, జీవనాధారాలు త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయడంలో తీవ్రంగా విఫలమవుతోందని విమర్శించారు. కాంటూర్ పేరుతో కాకుండా మొత్తం మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ముంపు ప్రాంతం అనే నెపంతో మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిద్రించేందుకు గదులు, మరుగుదొడ్లు, స్నాన గదులు సరిపడా లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉందని, ఈ అన్ని అంశాలపై శాసనసభలో ప్రశ్నిస్తానని చెప్పారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వారి హక్కులు కాలరాయబడుతున్నాయని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానారి బాలకృష్ణ, కెవిపిఎస్ నాయకులు కోట మోహన్ రావు, లారీ యూనియన్ కార్యదర్శి మహమ్మద్ వలీ పాషా, గిరిజన సంఘం మండల కార్యదర్శి పట్ల లక్షమయ్యతో పాటు సీఐటీయూ, లారీ యూనియన్ నాయకులు కారం రమేష్, ఓగిరాల నాగరాజు, మహేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










