
బాపట్ల: డిసెంబర్ 2 :-ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో ఉత్తేజం నింపేందుకు ఈ నెల 5వ తేదీన జిల్లావ్యాప్తంగా మెగా పీటీఎం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి. తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సమాజ అభివృద్ధికి పునాది అని చెప్పారు. విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను అంచనా వేసి, విద్యా నాణ్యతను మెరుగుపరచడమే మెగా పీటీఎం నిర్వహణ లక్ష్యమన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత, 100% మార్కులు సాధించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని 1,405 పాఠశాలలు, 19 జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ (HPC) ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి వారివారి స్థాయికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.ఎఫ్‌ఎల్‌ఎన్‌ఎం ద్వారా విద్యార్థుల గణిత సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే 35 శాతం ప్రక్రియ పూర్తైందని, రెండు రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రతిభావంతులను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో ప్రతి గజిటెడ్ అధికారికి కొన్ని పాఠశాలలను కేటాయించి, విద్యార్థులకు లక్ష్యసాధనపై మార్గదర్శకత్వం అందించే కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల ప్రభావం నుండి విద్యార్థులను దూరంగా ఉంచేందుకు అవగాహన చర్యలు చేపడతామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు.విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఐదు నెలలపాటు ఎడ్యుకేషన్ వాలంటీర్లను నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాలలకు లభించిన పరికరాలు, లైబ్రరీ, క్రీడా సామగ్రిని పీటీఎంలో ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు.ధాన్యం సేకరణపై మాట్లాడుతూ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, జిల్లాలో ధాన్యం కొనుగోలు యథాశక్తిగా, పారదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటివరకు 7,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. డిసెంబర్ రెండో వారం నుండి వరి కోత పెరగనున్న నేపథ్యంలో ధాన్యం సేకరణను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు చెప్పారు.రైతుల కోసం 2,500 టార్పాలిన్ పట్టలు కొనుగోలు చేసి రైతు సేవా కేంద్రాలకు పంపిణీ చేశామని, గోదాములు కూడా సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జాతీయ స్థాయిలో ఆదర్శ జిల్లా ఎలా ఉండాలో అలాంటి సూక్ష్మ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏ రైతూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.








