
విజయవాడ, అక్టోబర్ 31:పేదలకు విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బందెల నజర్‌జీ విమర్శించారు. విద్యార్థుల సమస్యలు, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర విజయవాడ నగరానికి చేరిన సందర్భంగా గాంధీనగర్ ధర్నాచౌక్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
సభకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నజర్‌జీ మాట్లాడుతూ, “కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కాషాయీకరణ చేస్తూ, విద్యార్థులకు శాస్త్రీయ విద్యను దూరం చేస్తోంది. మూఢవిశ్వాసాలను ప్రోత్సహించే విద్యావిధానం అమలుచేస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇది విద్య హక్కు చట్టాన్ని అవమానపరచే చర్య” అని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయిలోనూ విద్యా రంగం సంక్షోభంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ “మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తాం” అని ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు సమస్యలను నిర్లక్ష్యం చేయడం దారుణమని, విద్యను హక్కుగా గుర్తించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఎఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.







