
గుంటూరు జిల్లా:- చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రైతుశ్రేయస్సే లక్ష్యంగా సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయ కమీషనరేట్, ఉద్యాన–పట్టు పరిశ్రమల డైరెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు (ఐఏఎస్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన, పట్టు పరిశ్రమల సాగును అవలంబించినప్పుడే రైతులకు ఏడాది పొడవునా సుస్థిర ఆదాయం లభిస్తుందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే మామిడి, జామ, అరటి వంటి తోటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ సాగు, హైటెక్ నర్సరీలు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రైతులకు మార్కెట్ లింకేజీలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పట్టు పరిశ్రమలో సిరికల్చర్ శిక్షణ, మల్బరీ సాగు, కీటక పెంపకంలో యువతకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ, డ్రోన్, రిమోట్ సెన్సింగ్ ద్వారా పంటల పర్యవేక్షణ మరింత మెరుగవుతుందని అన్నారు.

మరో ముఖ్య అతిథి ఏపీ అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం. మల్లికార్జున రావు మాట్లాడుతూ, సామాజిక అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సాధ్యమన్నారు. శ్రీగంధం, మద్ది, ఎర్రచందనం వంటి విలువైన అటవీ మొక్కల సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. పొలం చుట్టూ చెట్లు పెంచడం వాతావరణ మార్పుల నుంచి రక్షణగా నిలుస్తుందని వివరించారు.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, శాస్త్రీయ వ్యవసాయం, సాంకేతికత, సేంద్రీయ పద్ధతుల సమ్మేళనంతోనే రైతుకు లాభదాయక వ్యవసాయం సాధ్యమన్నారు. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు తెరుస్తున్నాయని పేర్కొన్నారు.
యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం జోడించబడినప్పుడే రైతు ఇంట నిజమైన సంక్రాంతి వస్తుందని అన్నారు. శాటిలైట్ డేటా, డ్రోన్, ఏఐ ద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గించే దిశగా విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులను సత్కరించి పురస్కారాలు అందజేశారు. సంప్రదాయ హరిదాసు, కొలాటాలు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక నృత్యాలతో సంక్రాంతి సందడి నెలకొంది. వరి నుంచి ఆయిల్ ఫామ్ వరకూ 12 రకాల పంటలపై సాంకేతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 250 మంది రైతులు పాల్గొని తమ సమస్యలు, అనుభవాలను పంచుకున్నారు.Guntur Local news
కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. ధనుంజయరావు, ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాసరావు, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కర్నల్ ఆచార్య పి. నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










