VIJAYAVADA NEWS: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష
MINISTER NARAYANA MEETING
వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మత్తులు పూర్తిచేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేసారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు,సమస్యల పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని,ఎ మ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామమోహన్, బోడె ప్రసాద్ తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ప్రజారోగ్యవిభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ మరియన్న, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను అధిగమించడం, అభివృద్ది ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నగరంలో త్వరలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. హానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకూ ఫ్లైఓవర్ నిర్మిస్తుండటంతో ఈలోగానే ప్రత్యామ్నాయ రహదారులను ఎంపిక చేసి కొత్తగా రోడ్లు వేయాలని సూచించారు..అమరావతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు కొరకు పలు రహదారులను ఎంపిక చేసినట్లు ఎంపీ కేశినేని చిన్ని మంత్రి నారాయణకు వివరించారు. ఈ రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్ట్ కారిడార్ లో గ్రీనరీ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరోవైపు తమ నియోజకవర్గాల్లో పార్కుల అభివృద్దికి సంబంధించి ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు మంత్రి ముందుంచారు. కార్పొరేషన్ లో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పార్కులను అభివృద్ది చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. నగరంలో మెప్మా లో ఉన్న స్వయం సహాయక మహిళలకు ఆదాయం సమకూరేలా పలు ప్రతిపాదనలపై చర్చించారు. మెప్మా ఎండీతో చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజయవాడ కమిషనర్ ధ్యానచంద్రకు మంత్రి నారాయణ సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నగరాభివృద్దికి కృషి చేయాలని మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేసారు.