విజయవాడ, సెప్టెంబరు 21 (ప్రతినిధి):
ఇంద్రకీలాద్రిపై సెప్టెంబరు 22 నుండి అక్టోబర్ 2 వరకు జరుగనున్న విజయవాడ దసరా ఉత్సవాల్లో భక్తులు ఏవిధమైన అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునేలా నగర పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్రం నలుమూలలతో పాటు తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో దాదాపు 4500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయబడినట్లు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్. గారు తెలిపారు.
దసరా బందోబస్తులో పాల్గొనే వివిధ జిల్లాల సిబ్బంది కోసం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో పోలీస్ సిబ్బందికి మార్గదర్శకాలు, సూచనలు, భద్రతా పథకాలు తెలియజేయబడ్డాయి.
“భక్తితో విధులు నిర్వహించాలి” – సీపీ సూచన
ఈ సందర్భంగా సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ,
“ఇది సాధారణ బందోబస్తు కాదు. భక్తులతో సరైన వ్యవహారం, సమన్వయం ఉండాలి. ఆలయ సిబ్బంది, ఇతర శాఖలతో పాటు VIPలతో కూడా వివాదాలకు తావులేకుండా సమన్వయం ఉండాలి. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాలి. ఒక్కొక్క పాయింటులో అధికారుల నుంచి సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను బాధ్యతగా నిర్వర్తించాలి.”
అలాగే సెక్యూరిటీ పాయింట్లు వదిలి ఎవరూ రిలీవర్ రాకముందే వెళ్లకూడదని, సెకండ్ ఇన్‌చార్జ్‌లు చురుగ్గా వ్యవహరించాలని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. క్యూలైన్లలో భక్తుల ప్రవర్తనను గమనిస్తూ, ఫ్రీ ఫ్లో క్యూలైన్ నిర్వహణకు ప్రత్యేక దృష్టి ఇవ్వాలన్నారు.
కమాండ్ కంట్రోల్‌కు కీలక పాత్ర
ఈసారి సర్వశాఖల సమన్వయంతో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. అక్కడ నుంచే అన్ని విభాగాలను సమన్వయం చేస్తారు. క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సమాచారం ఇవ్వగలుగుతారు.
కలెక్టర్ లక్ష్మీ షా సూచనలు:
జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఐఏఎస్. గారు మాట్లాడుతూ,
“గత నెలరోజులుగా సీపీ గారితో కలిసి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసాం. ఈసారి ప్రత్యేకంగా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తున్నాం. భక్తులతో సరైన తీరులో వ్యవహరించాలి. మనమూ ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ విధులు నిర్వహించాలి.”
ఏదైనా ఇబ్బంది ఉంటే సమీప QR కోడ్ స్కాన్ చేసి కమాండ్ కంట్రోల్‌కు తెలియజేయాలని సూచించారు. “టీమ్ NTR అంటే మనం అందరం కలిసి పనిచేయాలి,” అని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్:
VMC కమిషనర్ ధ్యాన్ చంద్, ఐఏఎస్. గారు మాట్లాడుతూ,
“దాదాపు 10,000 మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారు. 35 లక్షల వాటర్ బాటిల్స్, శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్షం వచ్చినా అప్రమత్తంగా ఉండాలి. నీరు నిలిచిన చోట్లను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.”
కీలక హాజరు:
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, కలెక్టర్ లక్ష్మీ షా, మున్సిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్, డీసీపీలు కె.జి.వి. సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఉదయరాణి, ఎస్.వి.డి. ప్రసాద్, సాయి ప్రసాద్, ఆనందరెడ్డి, ఉదయభాస్కర్ తదితరులు, అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.